: 'బేర్' దెబ్బకు తోకముడిచిన 'బుల్'!
సెషన్ ఆరంభంలోనే 28 వేల పాయింట్ల ఎగువకు దూసుకెళ్లిన సెన్సెక్స్ 'బుల్', చైనాలో 'బేర్'ల ధాటికి తోక ముడవాల్సి వచ్చింది. ఆరంభంలో ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు సెషన్ గడిచే కొద్దీ, అమ్మకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో, మధ్యాహ్నం 12 గంటల సమయంలో నష్టాల్లోకి జారిన సూచికలు, 2:30 గంటల సమయంలో తిరిగి లాభాల్లోకి వెళ్లినప్పటికీ దాన్ని నిలుపుకోలేక పోయాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 46.73 పాయింట్లు పడిపోయి 0.17 శాతం నష్టంతో 27,813.54 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 10.75 పాయింట్లు పడిపోయి 0.13 శాతం నష్టంతో 8,466.55 పాయింట్లకు చేరాయి. ఈ సెషన్లో బీపీసీఎల్, టాటా స్టీల్, టీసీఎస్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, గెయిల్, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, కెయిర్న్, సిప్లా తదితర కంపెనీలు నష్టపోయాయి. ఇదే సమయంలో బీఎస్ఈ మిడ్ కాప్ 0.47 శాతం, స్మాల్ కాప్ 0.85 శాతం లాభపడటం గమనార్హం. చైనా స్టాక్ మార్కెట్లో షాంగై కాంపోజిట్ 6.52 శాతం నష్టపోయింది.