: తెలిసిన వాడని వెంట తీసుకెళ్తే, కత్తితో పొడిచి రూ. 10 లక్షలు లాక్కుపోయాడు!


డబ్బులు వసూలు చేసుకువచ్చేందుకు వెళ్తూ, తెలిసిన వాడు కదాని మరో వ్యక్తిని వెంట తీసుకెళ్తే, రూ. 10 లక్షలు దోపిడీ చేసిన ఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల సమీపంలో జరిగింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బనగానపల్లి మండలం పలుకూరులో ఓ నాపరాయి ఫ్యాక్టరీకి దస్తగిరి యజమాని. అతని వద్ద గోరంట్ల నాగరాజు అనే వ్యక్తి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపారానికి సంబంధించి బాకీలు వసూలు చేసుకొచ్చేందుకు వడ్డె శ్రీనివాసులుతో కలసి బైకుపై పలుకూరు వెళ్లి తిరిగి వస్తున్నాడు. గోర్లగుట్ట సమీపంలోకి రాగానే బండిపై వెనుక కూర్చున్న శ్రీనివాసులు తన వద్ద ఉన్న కత్తితో నాగరాజు వీపుపై పొడిచాడు. ఇదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు దుండగులు నాగరాజు తలపై రాడ్ తో మోది అతని వద్ద ఉన్న రూ. 10 లక్షల నగదు బ్యాగును తీసుకుని పరారయ్యారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసులు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News