: డస్ట్ బిన్ లో చెత్త వేయండి ... ఉచితంగా వైఫై పొందండి!
నెసెసిటి ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్... అన్నారు. అవును, అవసరమనేదే కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. అలాగే, ఇప్పుడు ముంబైకి చెందిన ఇద్దరు కామర్స్ గ్రాడ్యుయేట్ కుర్రాళ్లు డస్ట్ బిన్ నుంచి వైఫై ఎలా పొందచ్చో కనిపెట్టారు. ఇందుకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, అక్కడి చెత్తనంతా పటుకొచ్చి డస్ట్ బిన్ లో వేయాలంటున్నారు ప్రతీక్ అగర్వాల్, రాజ్ దేశాయ్ అనే ఈ యువకులు. దానికోసం 'వైఫై ట్రాష్ బిన్' పేరుతో డస్ట్ బిన్ ను ఏర్పాటు చేశారు. అందులో చెత్తవేస్తే వైఫైను ఉచితంగా అందించే ఓ కోడ్ వస్తుందట. దాని ద్వారా వైఫైని మనం తీసుకోవచ్చన్నమాట. అసలీ ఆలోచన కూడా వీరికి తమాషాగా వచ్చింది. ఒకరోజు ఆ ఇద్దరు యువకులు ముంబైలోని ఓ శివారు ప్రాంతంలో జరిగిన మ్యూజికల్ పార్టీకి వెళ్లారు. అక్కడ ప్రాంతమంతా డ్రింక్స్, ఫుడ్ వ్యర్థాల చెత్తతో పేరుకుపోయింది. ఆ ప్రాంతంలో ఎలాంటి నెట్వర్క్ లేకపోవడంతో ఫోన్ కాల్ కూడా చేయలేకపోయామని, తమ స్నేహితులను కాంటాక్ట్ చేయడానికి తమకు ఆరు గంటల సమయం పట్టిందని అగర్వాల్ తెలిపాడు. అప్పుడే హాట్ స్పాట్స్ ద్వారా ఉచితంగా వైఫై ఎందుకు అందించకూడదనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పాడు. డెన్మార్క్, ఫిన్ లాండ్, సింగపూర్ వంటి దేశాల్లో శుభ్రత కోసం చేపట్టిన నయా పద్ధతులే తమకు స్పూర్తిగా నిలిచాయంటున్నాడు. గతంలో టెలికం ఆపరేటర్ సాయంతో దాన్ని ప్రయోగాత్మకంగా బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో జరిగే పార్టీల్లో పరీక్షించాలని భావించినా అప్పట్లో కుదరలేదన్నాడు. ఇప్పుడు గెయిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, చర్చలు చేస్తున్నామని వివరించాడు. ఇటీవల ఎరిక్సన్, సీఎన్ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'నెట్వర్కడ్ ఇండియా' కార్యక్రమంలో వైఫై బిన్స్ ను ప్రదర్శించారట.