: మరింత పతనమైన క్రూడాయిల్ ధర... మనకు మంచిదేగా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింతగా తగ్గాయి. మంగళవారం నాటి సెషన్లో యూఎస్ బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 41.80 డాలర్లకు (సెప్టెంబర్ డెలివరీ) పడిపోయింది. మార్చి 2009 తరువాత క్రూడాయిల్ ధర ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. చైనాలో తగ్గిన డిమాండ్, బలపడిన డాలర్ ధరల పతనానికి కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, గత నెలతో పోలిస్తే క్రూడాయిల్ ధరలు మరింతగా తగ్గడంతో భారత క్రూడ్ బాస్కెట్ ధరలపైనా ప్రభావం పడింది. ఇండియా దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ ధర సగటు ఈ నెలలో 50 డాలర్లకన్నా దిగువకు రావడంతో నెలాఖరులో మరోసారి పెట్రోలు ధరలను తగ్గించే అవకాశాలున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, 31వ తేదీన చమురు కంపెనీలు ధరల సవరణపై సమావేశం జరపనున్నాయి. ముడిచమురు ధరలు ఎంత తగ్గితే భారతీయులకు 'పెట్రో' ఉత్పత్తుల రూపంలో అంత ఆదా అవుతుందన్న సంగతి తెలిసిందే.