: అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏపీ సర్కారు సరికొత్త 'షాక్'!
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నిమిత్తం భూములు ఇవ్వాలని చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి స్పందించి వేలాది మంది రైతులు 30 వేల ఎకరాలకు పైగా భూములను ఇవ్వగా, అదే చంద్రబాబు సర్కారు వారికి షాకిచ్చింది. ఆ భూములకు సంబంధించిన విద్యుత్ బకాయిలను తక్షణం చెల్లించాలని, లేకుంటే దాన్ని ఇంటి విద్యుత్ కనెక్షన్ల బిల్లులో కలిపేస్తామని, అప్పుడూ కట్టకుంటే ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తామని విద్యుత్ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చి కొత్త బిల్లులను పంపుతున్నారు. విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయించుకోలేదు కాబట్టి నెలనెలా కనీస బిల్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. భూములే పోయాయి, వ్యవసాయ బిల్లులతో ఇక పనేంటి, ప్రభుత్వం రద్దు చేయిస్తుందన్న భరోసాతో ఉన్న రైతులు దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై సీఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఆలోచనలో పడ్డ అధికారులు రైతులకు కౌలు రూపంలో ఇచ్చే మొత్తంలో ఈ బిల్లులను మినహాయించుకునే ఏర్పాటును చేయించాలని ఆలోచిస్తున్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రస్తుతానికి రైతులను వేధించకుండా చూడాలని వారు కోరనున్నట్టు సమాచారం. కాగా, మొత్తం 4,700 మంది రైతులకు రూ. 2 కోట్ల విలువైన బిల్లులు వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క తుళ్లూరు మండలంలోనే రూ. కోటికి పైగా బిల్లులు వచ్చాయట.