: అధ్యాపకుల వేధింపులతో ఒకే గదిలో ఉరేసుకున్న ఇద్దరు విద్యార్థినులు - నారాయణ కాలేజీలో విధ్వంసం
కడప సమీపంలోని చింతకొమ్మదిన్నె మండలంలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. కడప, ఓం శాంతినగర్ కు చెందిన నందిని (16), సిద్దవటం మండలం భాకరాపేటకు చెందిన మనీషా (16)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులైన వీరు మరణంలోనూ తమ స్నేహాన్ని వీడకపోవడం పలువురికి కంటతడి పెట్టించింది. కాగా, అధ్యాపకులు వేధించడం వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తూ, కళాశాలలో విధ్వంసం సృష్టించారు. పిల్లలు ఇంత ఘోరం చేసుకుంటే, ఆ వెంటనే తమకు తెలియజేయలేదని ఆరోపించారు. వేధింపుల విషయమై తాము ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. కాలేజీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.