: చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీ ఛేజింగ్... ‘ఎర్ర’ దొంగలను వెంటాడి పట్టుకున్న టాస్క్ ఫోర్స్
ఎర్రచందనం అక్రమ రవాణాపై కొత్తగా ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న రెడ్ శాండల్ స్మగ్లింగ్ ను నిరోధించేందుకు పోలీసు, అటవీ శాఖ సిబ్బందితో కలిపి ఏపీ ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నేటి తెల్లవారుజామున ‘ఎర్ర’ స్మగ్లింగ్ పై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ స్మగ్లర్లపై మెరుపు దాడి చేసింది. దాదాపు రూ.కోటి విలువ కలిగిన ఎర్రచందనాన్ని లారీలో వేసుకుని పరారవుతున్న తమిళ కూలీలు పుత్తూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ కంటబడ్డారు. లారీని నిలువరించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన యత్నాలేవీ ఫలించలేదు. దీంతో జీపులెక్కిన పోలీసులు లారీని సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. బెంబేలెత్తిపోయిన తమిళ కూలీలు తడ చెక్ పోస్ట్ వద్ద లారీని నిలిపేశారు. లారీని, అందులోని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 30 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు.