: మంచిని విమర్శించేవారంతా రాక్షసులే!... పిట్టకథ చెప్పిన టీ సీఎం కేసీఆర్
ఏదైనా మంచిపని చేయాలనుకున్నప్పుడు అడ్డుకునే వాళ్లు ఉంటారని, వారిని అధిగమించి ముందుకు సాగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. నిన్న 'గ్రామజ్యోతి' పథకం ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన, తన వ్యాఖ్యలు అక్షర సత్యాలని నిరూపించేందుకు ఓ పిట్ట కథను వల్లె వేశారు. ‘‘రామాయణం గురించి మనందరికీ తెలిసిందే కదా. రావణుడు సీతను ఎత్తుకుపోయినపుడు యుద్ధంలో రాక్షస సైన్యం ముందు వానర సైన్యం నిలవలేకపోయింది. దీంతో సమాలోచన చేసిన వానర సైన్యం ‘రామబాణం తీయాల్సిందే’’నని రాముడిని కోరింది. అయితే రామబాణంతో అంతా చనిపోతారని రాముడు సంశయిస్తుంటే ‘రామబాణం తీయకపోతే సీత మనకు దక్కదు’ అని వానర సైన్యం ఆయనపై ఒత్తిడి చేసింది. దీంతో రాముడు రామబాణాన్ని ప్రయోగించాడు. రాక్షస జాతి మొత్తం చనిపోయింది. సీతను తీసుకువెళుతున్న సమయంలో అర్ధాయుష్షుతో చనిపోయిన రాక్షసులంతా ‘‘మీ రామబాణం వల్లే మాకీ గతి పట్టింది. మా పరిస్థితి ఏమిటి?’’ అని నిలదీశారు. దీంతో ‘‘ఏం ఫరవా లేదు. కలియుగంలో మీరంతా ఊరికి ఒకరో, ఇద్దరో చొప్పున పుడతారు. అప్పుడు జనాన్ని హాయిగా పీక్కు తింటారు’’ అని రాముడు వారికి చెప్పారు. ప్రస్తుతం మంచిని వ్యతిరేకించే వారంతా గా రాక్షస సంతతే’’ అని కేసీఆర్ చెప్పిన పిట్ట కథను అంతా ఆసక్తిగా వినడమే కాకుండా హాయిగా నవ్వేశారు.