: ఓటుకు నోటు వ్యవహారంలో ‘రూ.50 లక్షలు’ బెంగళూరు నుంచే... ఏసీబీ నోటీసుల భావన అదేనట!
ఓటుకు నోటు కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు స్వయంగా అందజేసీన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై తెలంగాణ ఏసీబీ అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా చిన్నపాటి సమాచారం కూడా లభించడం లేదు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు తాజాగా ఓ చిన్న ఆధారం దొరికినట్లే ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచే ఆ డబ్బు మూటలు వచ్చాయని, వాటిని మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడు సమకూర్చి ఉంటారని భావిస్తున్నారు. డీకే కుటుంబం ఆది నుంచి టీడీపీలోనే ఉంటోంది. ఏపీ, కర్ణాటకల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆదికేశవులునాయుడు టీడీపీ టికెట్ పైనే గతంలో చిత్తూరు ఎంపీగా గెలుపొందారు. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో లోక్ సభలో యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఓ విషయంలో ఓటేశారు. తదనంతర పరిణామాల్లో ఆదికేశవులునాయుడు వైఎస్ హయాంలోనే టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. వైఎస్ మరణం తర్వాత మళ్లీ టీడీపీ వైపు మళ్లిన ఆదికేశవులునాయుడు మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదికేశవులునాయుడు భార్య సత్యప్రభ చిత్తూరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆదికేశవులునాయుడు బతికి ఉన్నప్పటినుంచే శ్రీనివాసనాయుడుకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. బడా వ్యాపారవేత్తగా ఉన్న ఆయన 'ఓటుకు నోటు' వ్యవహారంలో అవసరమైన నిధులు సమకూర్చి ఉంటారని ఏసీబీ భావిస్తోంది. అంతేకాక, దర్యాప్తులో దీనికి సంబంధించిన కీలక సమాచారం లభించిన మీదటే ఏసీబీ ఆయనకు, ఆయన సన్నిహితుడు విష్ణుచైతన్యకు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.