: ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఇక సామాన్యులకు ఏముంటుంది?: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతోనే ఇన్ని సమస్యలు వచ్చాయని అన్నారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు విభజించారని మండిపడ్డారు. విభజన బిల్లులో రాజధాని గురించి స్పష్టంగా పేర్కొనలేదని దుయ్యబట్టారు. హైదరాబాదు వంటి రాజధాని కట్టాలంటే రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతాయని, నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందని తాను చెప్పానని వివరించారు. అయితే, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి, కేవలం గాల్లోనే రాజధాని కట్టారని ఎద్దేవా చేశారు. హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారే గానీ, దానిపై గవర్నర్ అధికారాల విషయంలో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. అధికారాలపై స్పష్టత లేకపోవడంతో గవర్నర్ అధికారం తీసుకోలేదని తెలిపారు. దాంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో అందరికీ తెలిసిందేనన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికే రాజధానిలో భద్రత లేకపోతే ఇక సామాన్యులకు ఏముంటుంది? అని పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎత్తిచూపారు. అంతకుముందు, విడిపోయిన రాష్ట్రంలోనూ భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని నిప్పులు కక్కారు. శివరామకృష్ణన్ కమిటీ వేసి, రాజధాని ఎంపిక బాధ్యతలు అప్పగించారని తెలిపారు. అయితే, కమిటీ రాష్ట్ర నలుమూలలా పర్యటించి, మీ ప్రాంతంలో రాజధాని కావాలా? మీ ప్రాంతంలో రాజధాని కావాలా? అంటూ అడగడం ద్వారా ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు నెలకొనే పరిస్థితి తలెత్తిందని అన్నారు. విభజన బిల్లులో కనీస ఉద్దేశాలు చెప్పలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. అడ్డగోలుగా విభజించడంతో ప్రజల్లో తీవ్ర ఆవేశం, అభద్రతాభావం కలిగాయని వివరించారు. కనీసం, విభజన చట్టం రూపొందించేటప్పుడు కూడా పెద్దగా ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం నష్టపోయిందని దుయ్యబట్టారు.