: విదేశీ పర్యటనల్లోనూ రాజకీయాలా?: మోదీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలను వదల్లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఉదయం మోదీ అరబ్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై "గత ప్రభుత్వాలు అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవడంలో సరైన మార్గంలో నడవలేదు. నేను దాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాను" అని చెప్పడాన్ని కాంగ్రెస్ నేత, మాజీ వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు. "తన పదవి గౌరవ మర్యాదలను విదేశాల్లో కాపాడుకోవడంలో ఆయన విఫలమయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలి" అని సలహా ఇచ్చారు. కాగా, కొంతమంది యూఏఈ ఇన్వెస్టర్లు ఇండియాకు వచ్చేందుకు సుముఖత చూపినా, అనుమతుల లభ్యత దగ్గర కాలేదని కొందరు పెట్టుబడిదారులు మోదీతో ప్రస్తావించగా, తమ వాణిజ్య మంత్రిని త్వరలో పంపుతానని, ఆయనతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు.