: డీఎంకే ధర్నాలో శవంగా నటించిన వ్యక్తి నిజంగానే శవమయ్యాడు!
ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన! తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీ నిర్వహించిన ధర్నాలో శవంగా నటించిన ఓ వ్యక్తి నిజంగానే శవమయ్యాడు. వివరాల్లోకెళితే... సేలం జిల్లా ఆత్తూరు రాణిపేటలో ఈ నెల 10న డీఎంకే పార్టీ సంపూర్ణ మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా, మద్యపానానికి అలవాటుపడిన వ్యక్తి ఎలా కడతేరిపోతాడో ఓ ప్రదర్శన రూపంలో వివరించారు. అందులో సేతు అలియాస్ సెల్వరాజ్ అనే డీఎంకే కార్యకర్త మద్యపానం కారణంగా చనిపోయినట్టు ఆ ప్రదర్శనలో నటించాడు. నిజమైన శవాన్ని ఎలా అలంకరిస్తారో అతడిని కూడా అలాగే అలంకరించారు. డీఎంకే ధర్నాలో ఈ శవం స్కిట్ బాగా హైలైట్ అయింది. బాగా నటించావంటూ అందరూ సెల్వరాజ్ ను అభినందించారు. ఆ తర్వాతి రోజే అతడు అనారోగ్యం పాలయ్యాడు. జ్వరం తీవ్రం కావడంతో అతడిని కుటుంబ సభ్యులు సేలం తీసుకువెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. జ్వర తీవ్రత కాస్త తగ్గిన తర్వాత ఆత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, జ్వరం మళ్లీ తిరగబెట్టడంతో సెల్వరాజ్ శనివారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. దాంతో, కుటుంబంతో పాటు డీఎంకే వర్గాల్లోనూ విషాదం అలముకుంది. ధర్నాలో శవంగా నటించిన వ్యక్తి ఇప్పుడు నిజంగానే శవం కావడం అందరినీ కలచివేసింది. పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి. తమతో పాటు ధర్నాలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడిలా విగతజీవుడిలా మారిపోతాడని ఊహించలేదని డీఎంకే నేతలు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు.