: ఈ బాబూరావు లీలలు ఇన్నిన్ని కాదయా!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న బాబూరావు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సీనియర్ విద్యార్థులతో మందు కొట్టడం, విద్యార్థినులను వేధిస్తున్న వారికి అండగా నిలవటం, తన మాట వినని వారికి మార్కులు తగ్గించడం, ప్రశ్నించిన అధ్యాపకులను తొలగించడం... ఇలా ఆయన లీలలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. 2009లో ఆర్కిటెక్చర్ కళాశాలకు రాకముందు ఆయన కృష్ణా జిల్లా అరిగిపల్లి ఎస్ఏఆర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారట. ఆ సమయంలో మహిళా అధ్యాపకులను వేధించాడని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో తొలగించారట. గత చరిత్ర గురించి తెలుసుకోకుండానే నాగార్జున వర్శిటీలో ఆయనకు స్థానం కల్పించారు. ఆపై కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. కళాశాల బయట ఫ్రెషర్స్ పార్టీలు పెట్టడం, ఆపై మద్యం సేవించడం, ప్రిన్సిపాల్ పేరిటే బిల్లు తీసుకోవడం వంటివి ఆధారాలతో బయటపడ్డాయి. ఆయన అండ చూసుకునే రిషితేశ్వరిపై సీనియర్ల వేధింపులు జరిగాయని విచారణ కమిటీ నిర్ధారించినా, ఇప్పటికి కూడా ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదని ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.