: ఉడుము కోసమెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుని... ఐదున్నర గంటల పాటు బాలుడి నరకయాతన
నిజామాబాదు జిల్లా మద్నూరు మండలం పెద్దశక్కర్లకు చెందిన పదిహేనేళ్ల బాలుడు హన్మాండ్లు సరదాగా చేసిన పని అతడిని ప్రాణాపాయం దాకా తీసుకెళ్లింది. తనతోటి పిల్లలతో గ్రామంలో ఆడుకోవడానికి బదులు హన్మాండ్లు సరదాగా ఉడుముల వేటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని ఎల్లమ్మగుట్టకు చేరుకున్న ఆ బాలుడు అక్కడి బండరాళ్ల మధ్య ఉన్న ఓ సొరంగంలో ఉడుమును గుర్తించాడు. ఇంకేముంది, దానిని పట్టేద్దామని సొరంగంలో దూరాడు. తీరా అందులోకి వెళ్లిన తర్వాత బండరాళ్ల మధ్య ఇరుక్కున్న అతడికి బయటకు ఎలా రావాలో తెలియలేదు. చాలా సేపు ప్రయత్నించి, ఇక తన వల్ల కాదని నిర్ధారించుకుని వెంట తెచ్చుకున్న సెల్ ఫోన్ తీసి, ఇంటి వద్దనున్న బంధువులకు సమాచారం చేరవేశాడు. వారు గ్రామ సర్పంచ్ ద్వారా అధికారులకు సమాచారమందించి అక్కడికి చేరుకున్నారు. అధికారులు ప్రొక్లెయిన్లతో తరలివచ్చి బండరాళ్లను తొలగించి బాలుడిని కాపాడారు. ఇదంతా జరగడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం పట్టింది. అంతసేపు బాలుడు బండరాళ్ల మధ్య నరకయాతన అనుభవించాడు.