: ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం... ముగ్గురు సీనియర్లపై చర్యలకు రంగం సిద్ధం
మొన్న గుంటూరు, నిన్న ఏలూరు, తాజాగా తిరుపతి... విద్యాలయాల్లో ర్యాగింగ్ జడలు విప్పింది. కోటి ఆశలతో విశ్వవిద్యాలయాల్లో అడుగుపెడుతున్న జూనియర్లపై సీనియర్ల వేధింపులు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనతో కఠిన చర్యలకు చంద్రబాబు సర్కారు తెరలేపినా, సీనియర్లు యథేచ్ఛగా ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎంసీఏ విభాగంలో ఇటీవల జూనియర్లపై సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వర్సిటీలోని డి-బ్లాక్ లో వెలుగు చూసిన ఈ ఘటనపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ దేవరాజు, రెక్టార్ జయశంకర్ దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని తేలింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడ్డ ముగ్గురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.