: కళ్లల్లో కారం కొట్టి రూ. 11 లక్షలతో జంప్
రూ. 11 లక్షల సొమ్ముతో వెళ్తున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టిన దుండగులు ఆ డబ్బు తీసుకుని పారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఈ ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాయల్ ఫుడ్ బిస్కెట్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న అనిల్ రూ. 11 లక్షల నగదున్న బ్యాగుతో కంపెనీ నుంచి తన టూవీలర్ పై బయలుదేరాడు. కాటేదాన్ శివార్లలోకి రాగానే, వెంబడిస్తూ వచ్చిన దుండగులు అనిల్ కళ్లలో కారం కొట్టగా, బండిపై నుంచి అదుపుతప్పి పడిపోయాడు. ఆ వెంటనే దుండగులు నగదున్న బ్యాగుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దుండగులెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని వివరించారు.