: సుందర్ పిచయ్... రాగింగ్ చేసే వారి ఫేవరెట్: ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి
ఐఐటీ ఖరగ్ పూర్... ప్రపంచానికి ఎంతో మంది ప్రముఖులను అందించిన విద్యాసంస్థ. ముఖ్యంగా 1985 నుంచి 1993 మధ్య ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారిలో ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, సోషల్ ఎంటర్ ప్రెన్యూరర్ హెచ్.హరీష్ హాండే ప్రఖ్యాత రామన్ మెగససే అవార్డును అందుకున్నారు. ఇదే సమయంలో ఖరగ్ పూర్ లో విద్యాభ్యాసం చేసిన సుందర్ పిచయ్ ఇప్పుడు గూగుల్ సంస్థలో సీఈవో అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం బోస్టన్ లో ఎనర్జీ ఇంజనీర్ గా పనిచేస్తున్న సౌవిక్ గంగోపాధ్యాయ ఓ పత్రికతో తన అభిప్రాయాలు పంచుకుంటూ, బక్కగా కనిపించే సుందర్ ను తొలి రోజుల్లో సీనియర్లందరూ ర్యాగింగ్ చేసే వాళ్లని గుర్తు చేసుకున్నాడు. 1989లో సుందర్, (ఐఐటీలో అందరూ సుండీ అని పిలుచుకునేవారట) తొలిసారిగా ఖరగ్ పూర్ వచ్చాడని చెప్పాడు. సీనియర్లు ఎవరికైనా స్వాగతం పలికారంటే, అతనికి ర్యాగింగ్ తప్పదని అర్థమని, అప్పట్లో కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువగానే జరిగేదని చెప్పాడు. హాస్టల్ బాల్కనీల్లో నిలబడి ఎవరిని సులువుగా ర్యాగింగ్ చేయవచ్చని చూసే ప్రతి సీనియర్ కూ సుందర్ కనిపించేవాడని, అదే వారికీ, అతనికీ మధ్య భవిష్యత్ బంధం బలపడేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఐఐటీలో తన చివరి రోజున సుందర్ ను ఆఖరిసారి కలిశానని, అప్పటి చిత్రాలు చూస్తే, నాడు, నేడు సుండీ ఒకేలాగున్నాడని, తమ జూనియర్ ఇంత అత్యున్నత స్థాయికి చేరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.