: 'సోమవారం నుంచి సినిమా చూపిస్తాం': ఎస్వీ యూనివర్శిటీలో జూనియర్లకు సీనియర్ల వార్నింగ్!
"మాకిప్పుడు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారంతో అయిపోతాయి. ఆ తరువాత మీకు సినిమా చూపిస్తాం" ఇది తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ జూనియర్లకు సీనియర్ల నుంచి వస్తున్న హెచ్చరిక. హాస్టళ్లలో తమ గదులకు జూనియర్లను పిలిపించుకుంటున్న సీనియర్లు తమ ఇష్టానుసారం ర్యాగింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ర్యాగింగ్ జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను వీరు పట్టించుకోవడం లేదని జూనియర్లు వాపోతున్నారు. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు 10వ తేదీ నుంచి క్లాసులు మొదలు కాగా, వీరికి డీ-బ్లాక్ లో వసతి కల్పించారు. రోజూ రాత్రి 10 గంటల సమయంలో జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని సీనియర్లు వారిని ర్యాగింగ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చేతులు చాపి 2 గంటలకు పైగా నిలబెట్టడం, టేబుల్ కింద క్రికెట్ ఆడాలని, నేల మీద కప్పలా గెంతులేయాలని, నేలపైనే ఈతకొట్టి చూపాలని, ఇవన్నీ సోమవారం నుంచి చేయాల్సి వుంటుందని హెచ్చరించారట. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అన్ని సబ్జెక్టులూ ఫెయిల్ చేయిస్తామని భయపెట్టారట. దీంతో దిగాలు పడ్డ జూనియర్లు తమ టీసీలు ఇచ్చేస్తే వెళ్లిపోతామని మొరపెట్టుకుంటున్నారు.