: ఒకరిని ఒకరు అభినందించుకున్న కేజ్రీవాల్, మోదీ
రాజకీయాల్లో భాగంగా విమర్శలు గుప్పించుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీలు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. నేడు కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపితే, ఆయన విషెస్ తన మనసును తాకాయని కేజ్రీ వ్యాఖ్యానించారు. తాను కేజ్రీవాల్ కు స్వయంగా ఫోన్ చేశానని, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానని, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించానని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దీనికి ప్రతిగా, కేజ్రీవాల్ సైతం ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు. మోదీ శుభాకాంక్షలు తన మనసును తాకాయని, త్వరలోనే ఢిల్లీ పరిస్థితులపై మోదీని కలిసి వివరిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య రగులుతున్న చిచ్చుకు బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి.