: మరో వివాదంలో అరవింద్ కేజ్రీవాల్!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో విన్యాసాలు చేస్తున్న విద్యార్థులు పలుమార్లు ఆయన పేరును ప్రదర్శించడం విమర్శలకు గురైంది. స్వాతంత్ర్య వేడుకలను ఆయన రాజకీయానికి ఉపయోగించుకున్నారని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించగా, విద్యార్థులు తమ విన్యాసాల్లో భాగంగా 'అరవింద్ కేజ్రీవాల్' పేరు ఆకారంలో ఫార్మేషన్స్ చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఈ విన్యాసాలు తనకు తెలియకుండా జరిగాయని వెల్లడించారు. "కొందరు విద్యార్థులు నా పేరును ప్రదర్శించారు. వీరిలా చేస్తారని నాకు తెలియదు" అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తానని అన్నారు. 'జై హింద్' అనాల్సిన చోట, 'జయహో కేజ్రీవాల్' అనిపించుకుని ఆయన సిగ్గుమాలిన పని చేశారని ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, గతంలో ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ విధులు నిర్వహించిన సమయంలోనూ పంద్రాగస్టు వేడుకల్లో ఆమె పేరును ప్రదర్శించారని, లెఫ్టినెంట్ గవర్నర్ పేరులాగా కూడా విద్యార్థులు నిలబడతారని, ఈ పద్ధతి మారాలని ప్రభుత్వాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News