: రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం... కనిపించని చంద్రులు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ విందు కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. గవర్నర్ కార్యక్రమంలో ముఖ్యులిద్దరూ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలను గవర్నర్ నరసింహన్ పేరుపేరునా పలకరించి, ఉత్సాహం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రాలేదన్నది వాస్తవమని అన్నారు. ఇద్దరు సీఎంల గైర్హాజరీ వెనుక ప్రత్యేక కారణాలు వెతకవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను ఆమోదయోగ్యమైన గవర్నర్ నని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తన చివరి రోజు వరకు ఆమోదయోగ్యంగానే ఉంటానని ఉద్ఘాటించారు. తాను ఆశావాదినని... పరిస్థితులన్నీ చక్కబడతాయని పేర్కొన్నారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు కార్యక్రమంలో ఉన్నారని, కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల సమీక్షలో ఉన్నారని, అందుకే రాలేకపోయారని వివరణ ఇచ్చారు.