: సినీ తారల పేర్లతో పరస్పరం పొగుడుకున్న రాజకీయనాయకులు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత విలాస్ రావు దేశ్ ముఖ్ విగ్రహాన్ని లాతూర్ లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవార్, ముండే సినీ తారల పేర్లతో ఒకరినొకరు అభినందించుకున్నారు. తొలుత పంకజా ముండే తన ప్రసంగంలో పవార్ గురించి మాట్లాడారు. సినిమాల్లో దిలీప్ కుమార్ ఎలాంటివారో, రాజకీయాల్లో శరద్ పవార్ అలాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. పవార్ కు ఏమైనా బిరుదు తగిలించాల్సి వస్తే పొలిటికల్ దిలీప్ కుమార్ అని పిలవవచ్చని అన్నారు. అనంతరం, పవార్ తన వంతు రాగానే, పంకజా ముండేను నేటి తరం అందాల తార దీపికా పదుకొనేతో పోల్చారు. పంకజా ముండే రాజకీయాల్లో దీపికా పదుకొనే వంటివారని అన్నారు. తాను పెద్దగా సినిమాలు చూడనని, అందుకే, ప్రస్తుతం సినీ ఫీల్డ్ లో ఎవరు పాప్యులరో నటుడు రితేశ్ దేశ్ ముఖ్ (విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు) ను అడిగి తెలుసుకున్నానని వివరించారు. రితేశ్ ఇప్పుడు దీపికా పదుకొనేకు విశేష ప్రజాదరణ ఉందని చెప్పాడని, దాంతో, పంకజా ముండేను దీపికాతో పోల్చానని చెప్పుకొచ్చారు.