: సమైక్య రాష్ట్రంలో గుర్తింపు ఉండేది... సొంతరాష్ట్రంలో కనీస గుర్తింపు కూడా దక్కడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తమకు అవమానం జరిగిందంటున్నారు. మహబూబ్ నగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారులు తమకు సీట్లు కేటాయించకుండా కించపరిచారని వాపోయారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల ప్రస్తావన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో తమకు గుర్తింపు ఉండేదని, ఉద్యమకారులు అని గౌరవం ఇచ్చేవారని తెలిపారు. కానీ, సొంత రాష్ట్రంలో కనీస గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో అధికారుల తీరు ఇలాగే ఉందని విమర్శించారు. అధికారుల వైఖరి కారణంగా ప్రజాప్రతినిధులుగా పనిచేయలేని స్థితి నెలకొందని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, జడ్పీ చైర్మర్ భాస్కర్ లకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. దాంతో, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తమను పట్టించుకోలేదని శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వరెడ్డి, భాస్కర్ తదితరులు అలిగి వెళ్లిపోయారు.