: భారత్ నడ్డి విరిచిన హెరాత్... తొలి టెస్టులో ఘోర పరాజయం
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. నిన్న (మూడో రోజు) ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది. ఈ రోజు కేవలం 153 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఆటను ప్రారంభించింది. ఆట మొదలవడం ఆలస్యం... ఘనత వహించిన మన బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టడం మొదలుపెట్టారు. శ్రీలంక స్పిన్నర్ హెరాత్ మాయాజాలానికి మన ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. ఇంకా చెప్పాలంటే, మన వికెట్ల పతనం సైకిల్ స్టాండును తలపించింది. నిన్నటి పరిస్థితిని చూస్తే, ఈ టెస్టుపై శ్రీలంక దాదాపుగా ఆశలు వదులుకుంది. అయితే, స్పిన్నర్ హెరాత్ తన అద్భుతమైన బంతులతో టీమిండియా బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించాడు. 21 ఓవర్లలో కేవలం 48 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లను కూల్చాడు హెరాత్. 37 ఏళ్ల హెరాత్ తన అద్భుతమైన స్పెల్ తో శ్రీలంకను విజేతగా నిలిపాడు. హెరాత్ దెబ్బకు లోకేశ్ రాహుల్ (5), ఇషాంత్ శర్మ (10), రోహిత్ శర్మ (4), రహానే (36), సాహా (2), హర్భజన్ (1), అశ్విన్ (3) పెవిలియన్ చేరుకున్నారు. మరో ఎండ్ నుంచి హెరాత్ కు కౌశల్ రూపంలో మంచి సహకారం దొరికింది. 47 పరుగులిచ్చిన కౌశల్ మిగిలిన మూడు వికెట్లనూ కూల్చాడు. ధావన్ (28), కోహ్లి (3), అమిత్ మిశ్రా (15) వికెట్లను కౌశల్ బలిగొన్నాడు. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్ లో శ్రీలంక 1-0తో ముందంజ వేసింది. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఆటతీరుతో 162 పరుగులు చేసిన శ్రీలంక వికెట్ కీపర్ చండిమల్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఈ మ్యాచ్ లో స్కోరు వివరాలు: శ్రీలంక: తొలి ఇన్నింగ్స్ - 183 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ - 367 ఆలౌట్ భారత్: తొలి ఇన్నింగ్స్ - 375 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ - 112 ఆలౌట్