: ‘హోదా’ పోరుకు మేం సిద్ధం... మరి మీ మాటేమిటి?: టీడీపీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం ఘాటు స్పందనతో టీడీపీ సర్కారుపై వైసీపీ ప్రత్యక్ష యుద్ధం ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖకు సమాధానమిచ్చిన కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ యువనేత, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా సాధించే సత్తా చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? అని ఆయన నిలదీశారు. అయినా ప్రత్యేక హోదా ప్రకటనకు సంబంధించి కేంద్రం వైఖరిపై సమాచారం ఉన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. అసలు ఈ విషయంపై చంద్రబాబు నోరు విప్పకపోవడానికి గల కారణాలేమిటని కూడా మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరు సాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన, మరి టీడీపీ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.