: అమరావతి నిర్మాణ బాధ్యతలు విదేశాలకు అప్పగించడం అవమానకరమే: బాబు సర్కారుపై రఘువీరా ఫైర్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను విదేశాలకు అప్పగించడం తెలుగు ప్రజలను అవమానించడమేనని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. నేటి ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై రఘువీరా నిప్పులు చెరిగారు. ఓ వైపు భారతీయులు విదేశీ కార్పొరేట్ దిగ్గజాల సారథ్య బాధ్యతలను అందిపుచ్చుకుంటుంటే, రాజధాని నిర్మాణాన్ని సింగపూర్, జపాన్ లకు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు రాజధాని కోసం సేకరించిన భూములను ఏం చేస్తున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం విదేశాలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.