: నా కుటుంబసభ్యుల ఫోన్లూ ట్యాప్ చేశారు.. అయినా కుట్రలు నన్నేమీ చేయలేవు: చంద్రబాబు
ఓటుకు నోటు కేసు దరిమిలా వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ పై నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులు అడిగిన మేరకే ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ‘‘టెలిఫోన్ ట్యాపింగ్ మీద నేను ఎక్కువగా మాట్లాడను. నా ఫోనే కాక నా కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. నా మీద ఇప్పటివరకు చాలా మంది కుట్రలు చేశారు. అయినా ఆ కుట్రలేవీ నా మీద పనిచేయలేదు. ప్రజల్లో నా మీద విశ్వసనీయతే వారికి సమాధానం చెప్పింది. నా మీద కుట్రలు, కుతంత్రాలు పన్నిన వారు ఎక్కడికి పోయారో మీ అందరికీ తెలుసు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.