: మహా పురుషుల త్యాగఫలమే స్వతంత్ర భారతం... ఎర్రకోటపై ప్రసంగంలో ప్రధాని మోదీ
మహా పురుషుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన అక్కడి నుంచే జాతినుద్దేశించి ప్రసంగించారు. మహా పురుషుల త్యాగ ఫలం కారణంగానే భారత్ స్వతంత్ర భారతావనిగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ శక్తి అని ఆయన అన్నారు. ఈ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగానే నిలుస్తోందన్నారు. ఈ భావన తొలగిన నాడు దేశం ముక్కలుచెక్కలవుతుందన్నారు. దేశంలో మత మౌఢ్యానికి ఎట్టి పరిస్థితుల్లోను చోటివ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమన్నారు. 125 కోట్ల మంది భారతీయులు టీమిండియా స్ఫూర్తితో కృషి చేస్తే దేశం సమున్నత శిఖరాలకు చేరుతుందని ఆయన చెప్పారు.