: పవన్ కల్యాణ్ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్... ఆసక్తి రేపుతున్న పవర్ స్టార్ ట్వీట్స్
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కల్యాణ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ ను పోస్ట్ చేశారు. ప్రతి అంశంపైన విభిన్నంగా స్పందించే పవన్ కల్యాణ్ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ లోనూ తనదైన శైలిలో స్పందించారు. 'పర్వతం ఎవ్వడికీ ఒంగి సలాం చెయ్యదు' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కావ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన పోస్టింగ్ లు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు. పర్వతం ఎవ్వడికీ ఒంగి సలాం చెయ్యదు. నేనంతా ఓ పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే, ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’’ అంటూ ఎలుగెత్తిన శేషేంద్ర శర్మ కవితను పవన్ ట్వీట్ చేశారు. ‘‘కవి శేషేంద్ర చెప్పిన పై భావనే మనలో దేశం పట్ల ఉండాలి. దేశ పురోభివృద్ధి, సమైక్యత కోసం మనం శక్తిమేర కృషి చేయాల్సిందే’’ అని కూడా పవన్ వ్యాఖ్యానించారు.