: తెలంగాణలో ముగిసిన ‘మునిసిపల్’ సమ్మె...నేటి నుంచి విధుల్లోకి కార్మికులు
తెలంగాణలో 40 రోజుల క్రితం ప్రారంభమైన మునిసిపల్ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. వేతనాల పెంపు, సర్వీసు రెగ్యులరైజేషన్ ప్రధాన డిమాండ్లతో మొదలైన మునిసిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేవలం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ) పరిధిలోని కార్మికుల వేతనాలను పెంచిన కేసీఆర్ సర్కారు మిగతా కార్మికులకు సంబంధించి ఏమాత్రం స్పందించలేదు. దీంతో భగ్గుమన్న మిగతా మునిసిపాలిటీల కార్మికులు తమకు కూడా వేతనాలు పెంచేదాకా విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ఈ విషయంపై పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు 40 రోజులపాటు కార్మికులు సమ్మె కొనసాగించారు. నిన్న రాత్రి కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. నేటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని తెలిపింది.