: ఆరుగురు దొంగలను చితక్కొట్టి, పోలీసులకు పట్టించిన యువతి!
ఒక దొంగను పట్టుకోవడమే కష్టం, అలాంటిది ఏకంగా ఆరుగురు దొంగలను చితక్కొట్టడమంటే మాటలా? అంత కష్టమైన పనిని చాకచక్యంగా పూర్తి చేసింది ఓ యువతి. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని బెలగావి ఊర్లో దొంగల బెడద ఎక్కువ. ఆ ఊర్లో అన్నప్ప పాటిల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంట్లో దొంగతనం చేద్దామని స్కెచ్ వేసింది దొంగల ముఠా. అందులో భాగంగా ఇద్దరు దొంగలు అన్నప్ప ఇంటికి వెళ్లి ఆయన కుమార్తె సురేఖ (19)ను మంచి నీరు అడిగారు. నీరు తెచ్చేందుకు సురేఖ వెనుదిరగగానే మిగిలిన నలుగురు చొరబడి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె చెవి రింగులు లాగేసుకున్నారు. దీంతో పరిస్థితి గమనించిన సురేఖ దొంగలను బలంగా తన్ని, నేరుగా వంటింట్లోకి పరుగెత్తింది. అక్కడున్న కారం తీసుకుని ఇద్దరి కళ్లలో చల్లింది. అంతే... వారు విలవిల్లాడుతుండగా, వంట గదిలో ఉన్న పెద్ద కర్రను తీసుకుని మిగిలిన వారిని కొట్టడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా అరుపులు మొదలు పెట్టింది. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.