: హైదరాబాదు పోలీసులకు పట్టుబడ్డ వారిలో నజీర్ కీలకం!
హైదరాబాదులోని చంచల్ గూడలో అరెస్టయిన ఆరుగురిలో ఒక వ్యక్తి పాకిస్థానీ కాగా, ఐదుగురు బంగ్లాదేశీయులు. ఈ బంగ్లాదేశీయుల్లో నజీర్ అనే అతను కీలకమైన వ్యక్తి. 'హుజీ' ఉగ్రవాద సంస్థ ప్రధాన ప్రతినిధి నజీర్. ఇతను ఐదేళ్ల క్రితమే హైదరాబాదుకు వచ్చి నివాసం ఉంటున్నాడు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు వకాశ్ అలియాస్ సోనును దేశం దాటించడంలో కీలక పాత్ర నజీర్ దే. గత మూడు నెలల్లో నజీర్ 15 మందిని దొంగ పాస్ పోర్టులతో దేశం దాటించాడు. ఈ విషయంలో నజీర్ కి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కూడా సహకరించారు. వారిపై డిపార్ట్ మెంటల్ విచారణ జరుగుతోంది. నజీర్ నుంచి సిమ్ కార్డులు, వంద ఆధార్ కార్డులు, మూడు ఇండియన్ పాస్ పోర్టులు, బంగ్లాదేశ్ పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ లో ఉన్న 'హుజీ' ఉగ్రవాద సంస్థ ఆధినేత జబ్బార్ ఆదేశాల మేరకు నజీర్ భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. నజీర్ భార్యతో కలిసి చంచల్ గూడలో ఉంటున్నాడని సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు.