: ఇన్ఫోసిస్, రెడ్డీస్, గ్లెన్ మార్క్, అదానీ... ఆల్ టైం రికార్డుకు 22 కంపెనీలు
తగ్గిన జూలై నెల ద్రవ్యోల్బణంతో ఆర్బీఐ పరపతి సరళీకృతం దిశగా అడుగులు వేయవచ్చని వచ్చిన విశ్లేషణలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, స్టాక్ మార్కెట్ బుల్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ మరోసారి 28 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఈ క్రమంలో 22 కంపెనీల ఈక్విటీలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. వీటిల్లో లార్జ్ కాప్ సెక్టార్లు కూడా ఉండటం విశేషం. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, గ్లెన్ మార్క్ ఫార్మాస్యుటికల్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అబాట్ ఇండియా, టోరెంట్ ఫార్మా తదితర కంపెనీలున్నాయి. గడచిన ఐదు సెషన్లలో దాదాపు 3 శాతం నష్టపోయిన సూచికలు, శుక్రవారం నాడు 2 శాతం మేరకు పెరిగాయి. నేటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 517.78 పాయింట్లు పెరిగి 1.88 శాతం లాభంతో 28,067.31 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 162.70 పాయింట్లు పెరిగి 1.95 శాతం లాభంతో 8,518.55 పాయింట్ల వద్దకు చేరాయి. నిఫ్టీ-50లో 47 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. పంజాబ్ నషనల్ బ్యాంకు అత్యధికంగా 8.96 శాతం పెరిగింది. జీ ఎంటర్ టెయిన్ మెంట్, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంకుల ఈక్విటీలు 4 నుంచి 5 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 2.36 శాతం, స్మాల్ కాప్ 1.72 శాతం పెరిగాయి. మార్కెట్ కాప్ 1.04 కోట్ల కోట్లకు పెరిగింది.