: హైదరాబాద్ ను జల్లెడ పడుతున్న పోలీసులు, సెంట్రల్ మాల్ కు తుపాకీతో వెళ్లిన వ్యక్తి!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పోలీసులు జల్లెడ పతుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు, సాధారణ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మోహరించి, అడుగడుగునా నిఘా పెట్టి పలు కూడళ్లలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. పలు మాల్స్, థియేటర్లు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, పంజాగుట్ట, బేగంపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట, మెహిదీపట్నం తదితర ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, నగరంలోకి వచ్చే అన్ని దారుల్లోనూ ప్రత్యేక చక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను సోదాలు చేస్తున్నారు. వీటిల్లో భాగంగా పంజాగుట్టలోని సెంట్రల్ మాల్ కు తుపాకీతో ఓ మఫ్టీలోని కానిస్టేబుల్ ను పోలీసు అధికారులు పంపగా, అక్కడి సెక్యూరిటీ లోపాలు బహిర్గతమయ్యాయి. దుస్తుల్లో తుపాకీ ఉన్నా దాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి అనుమతించారు. దీంతో సెంట్రల్ మాల్ నిర్వాహకులకు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. అత్తాపూర్ లోని ఈశ్వర్ థియేటర్ లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. లోపలికి వెళ్తున్న వారిని అసలక్కడ కనీస తనిఖీలు కూడా చేయడం లేదని తెలుసుకుని నోటీసులు జారీ చేశారు.