: ప్రపంచానికే మార్గదర్శి ఇండియా!: పొగడ్తలు గుప్పించిన అమెరికా
భారతదేశంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్న వేళ అమెరికా పొగడ్తలతో ముంచెత్తింది. భారతావని ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ అభివర్ణించారు. "1947 నుంచి ఓ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ, వినూత్నతవైపు పయనిస్తూ, సుస్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా, వ్యూహాత్మక శక్తిగా, అంతర్జాతీయ స్థాయి విధానాలకు ఎంతమాత్రమూ తగ్గకుండా ఇండియా ముందు నిలిచింది" అని అధ్యక్షుడు బరాక్ ఒబామా తరపున కెర్రీ సందేశాన్ని పంపారు. "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న ఇండియా, అమెరికాలు కలసి నడుస్తూ, ప్రపంచంలో శాంతి, స్వేచ్ఛలను పెంపొందిస్తున్నాయి" అని అన్నారు. గత జనవరిలో ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడిందని అన్నారు. ప్రపంచానికి అహింసా సందేశాలు పంపిన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి భారత నేతలను ఈ సందర్భంగా తాము స్మరించుకుంటున్నామని కెర్రీ వివరించారు.