: రేపు ఒకే వేదికపై బాబు, కేసీఆర్!... చేతులు కలిపేనా?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం రాజ్ భవన్ లో జరిగే 'ఎట్ హోం' కార్యక్రమంలో కలుస్తారా? గత సంవత్సరం మాదిరిగా, చేతులు కలుపుతారా? నవ్వుతూ మాట్లాడుకుంటారా?... తెలంగాణ, ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద చర్చ ఇదే. ఇటీవల ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్యటన సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇదే తరహాలో విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలనూ ఆహ్వానిస్తే, ఆరోగ్యం బాగాలేని కారణంగా కేసీఆర్ హాజరుకాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయిన తరువాత జరుగుతున్న రెండవ పంద్రాగస్టు వేడుకల్లో ఇరువురు నేతల కలయికపై ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, సామాజిక సేవా కార్యకర్తలకు రాజ్ భవన్ ఆహ్వానాలు పంపింది. ఓటుకు నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల నేపథ్యంలో ఇరు నేతల మధ్య సామరస్య వాతావరణం దెబ్బతిని, రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉండటంతో వీరు కలుస్తారా? లేదా? అన్న విషయమై స్పష్టత కొరవడింది. దీంతో రేపు రాజ్ భవన్ లో జరిగే 'ఎట్ హోం' పార్టీపైనే అందరి దృష్టీ నెలకొంది.