: కేసీఆర్ సర్కారుకు రాజీవ్ శర్మ షాక్...‘ఔట్ సోర్సింగ్’ వేతనాల పెంపు ఫైలును తిప్పిపంపిన వైనం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన రాజీవ్ శర్మను... కేంద్రంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో కూడా మాట్లాడి తన వద్దకు తెచ్చుకున్నారు. అలాంటి రాజీవ్ శర్మ, కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా, దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీవ్ శర్మ సంతకం పడితే కాని అది అమల్లోకి రాదు. దీంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలు ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాల్సిన అవసరం మనకేముందని కూడా రాజీశ్ శర్మ ప్రభుత్వానికి గట్టిగానే ఎదురుతిరిగినట్లు సమాచారం. అంతేకాక సదరు ఫైలును పునరాలోచించాలని రాజీవ్ శర్మ తిప్పిపంపారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి ఏజెన్సీలతో మాట్లాడుకుంటామని వాదిస్తున్న రాజీశ్ శర్మ, వారి వేతనాల విషయం ఆయా ఏజెన్సీలే చూసుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన తేల్చిచెప్పారట. మరి రాజీవ్ శర్మ నిర్ణయంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.