: ‘హింద్లీష్’ నేర్చుకోవాలా?... అయితే రాహుల్ గాంధీ వద్దకెళ్లాల్సిందే!
ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు. మరి హింద్లీష్ ఏమిటనేగా మీ డౌటు? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కొత్త భాషను కనిపెట్టారని ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే ఏమిటంటే... హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్ లో పేపర్ పై రాసుకోవడమేనట! రాహుల్ గాంధీ కూడా ఇదే చేశారు. ఇటీవల అధికారపక్షంపై మాటల దాడి కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ మొన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. లలిత్ మోదీ నుంచి ఎంత డబ్బు అందిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన నోటివెంట పలు చలోక్తులు వినిపించాయి. మోదీ సర్కారుపై దూషణల పర్వం కూడా వాడిగానే వినిపించింది. అయితే ఇదంతా హింద్లీష్ ప్రభావమేనని ఓ ట్విట్టర్ పోస్ట్ చెబుతోంది. తాను ప్రసంగించాల్సిన అంశాలకు సంబంధించిన హిందీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఓ పేపర్ పై ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో రాసుకొచ్చారు. సదరు పేపర్లు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ‘‘లోగ్ పీఎం మోదీకో సున్నా చాహ్ తాహై, వో ఉస్ కీరాయ్ జాన్ నా చాహ్ తే హై’’ వంటి హిందీ వాక్యాలతో పాటు దాదాపుగా అన్ని వ్యాఖ్యలను కూడా ఆయన ఇంగ్లీష్ స్పెల్లింగ్ లోనే రాసుకొని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో ఈ పోస్ట్ పై కొందరు విస్మయం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఇందులో తప్పేముందని కూడా ప్రశ్నిస్తున్నారు.