: రిషితేశ్వరి ఇంట్లో రెండో డైరీ... అతడు చెప్పినట్లు వినాలని అనీషా బెదిరించిందని రాసుకున్న వైనం
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సీనియర్ల వేధింపులపై రిషితేశ్వరి రాసుకున్న ఓ డైరీని గతంలో పోలీసులు ఆమె హాస్టల్ గది నుంచే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఆమె ఇంటిలో మరో డైరీ లభ్యమైంది. దీనిని ఆమె తల్లిదండ్రులు నిన్న పోలీసులకు అప్పగించారు. ఈ డైరీలో రిషితేశ్వరి 12 పేజీలు రాసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారకులుగా భావిస్తూ సీనియర్లు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా రెండో డైరీలోనూ వీరి వేధింపులపై రిషితేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను సోదరుడిలా భావించే జితేంద్రతో తనకు సంబంధం ఉందని శ్రీనివాస్, జయచరణ్ లు తప్పుడు ప్రచారం చేశారని అందులో రిషితేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక తనను లైంగికంగా వేధించి వెంటపడ్డారని తెలిపింది. శ్రీనివాస్ చెప్పినట్లు వినాలని అనీషా తనను బెదిరించిందని కూడా ఆమె పేర్కొంది. ఇక తమ చేతికి అందిన రెండో డైరీని హాస్టల్ గదిలో లభించిన డైరీ, సూసైడ్ నోట్ తో పోలీసులు సరిపోల్చారు. రెండో డైరీని కూడా రిషితేశ్వరే రాసిందని కూడా వారు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఫ్రెషర్స్ డే ముగిసిన తర్వాత ఇంటికెళ్లిన సందర్భంగా రిషితేశ్వరి రెండో డైరీని రాసుకుందని పోలీసులు భావిస్తున్నారు.