: రాణించిన ధావన్, కోహ్లీ...టీమిండియా 375
శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అన్ని విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. తొలుత బౌలింగ్ లో అశ్విన్, మిశ్రా సత్తా చాటితే, బ్యాటింగ్ లో ధావన్, కోహ్లీ, సాహా రాణించారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 375 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు 128/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్, కోహ్లీ ఆది నుంచి లంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేశారు. 255 పరుగుల వద్ద కోహ్లీ (103) వెనుదిరగడంతో 200 పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్టపడింది. అనంతరం వచ్చిన రహానే పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. ధావన్ (134)కు జత కలిసిన వృద్ధిమాన్ సాహా (60) రాణించాడు. టెయిలెండర్లు ప్రతిఘటించినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో 375 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బౌలర్లలో 5 వికెట్లతో కుశాల్ రాణించగా, 3 వికెట్లతో ప్రదీప్, చెరో వికెట్ తీసి ప్రసాద్, మాధ్యూస్ చక్కని సహకారమందించారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది.