: ప్రధాన పార్టీ అధినేత్రి వెల్ లోకి రావడం విచారకరం: జైట్లీ
పార్లమెంటు సమావేశాలు ఈరోజు ముగియడంతో కాంగ్రెస్ పార్టీపై కేంద్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో మండిపడ్డారు. అకారణంగా సమావేశాలను అడ్డుకున్నారని, సమావేశాలను పదేపదే అడ్డుకోవడం వల్ల ఎంతో నష్టపోయామని అన్నారు. సమావేశాలను అడ్డుకోవడం వల్ల కాంగ్రెస్ ఏం సాధించిందని జైట్లీ ప్రశ్నించారు. పార్లమెంట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. సమస్యలు ఉంటే కూలంకషంగా చర్చించుకుంటే పరిష్కారవుతాయని హితవు పలికారు. ముఖ్యంగా ప్రధాన పార్టీ అధినేత్రి సభలో వెల్ లోకి రావడం విచారకరమంటూ, సోనియా గాంధీని పరోక్షంగా ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు సరైన వేదిక పార్లమెంట్ అని పేర్కొన్నారు. పార్లమెంట్ సజావుగా జరిగితేనే దేశానికి శ్రేయస్కరమని చెప్పారు. ఈ సమావేశాల్లో రాజ్యసభలో 91 శాతం, లోక్ సభలో 54 శాతం కాలం వృథా అయిందని వెల్లడించారు. ఈ సెషన్ లో ఉభయసభల నిర్వహణకు రూ.34 కోట్లు ఖర్చైందని తెలిపారు.