: పని చేస్తుంటే నిద్ర వస్తోందా? అయితే, ఇలా చేయండి!
రాత్రి సరిగా నిద్రపోలేదా? ఉదయం ఆఫీసుకు వెళ్లిన తరువాత నిద్ర వస్తోందా? మీరు అతిగా నిద్రపోయే హైపర్ సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నారా? ఈ సమస్యలను అధిగమించేందుకు ఏరోబిక్స్ చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నిద్రను కలిగించే ప్రొటీన్లు తగ్గుతాయి. రాత్రి సంతృప్తికరంగా నిద్రపోయిన తరువాత కూడా పగలు నిద్రవచ్చే వారిని భాగం చేస్తూ యనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది. అతిగా నిద్రించే రోగం, హైపర్ సోమ్నియాను తగ్గించుకునేందుకు ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయాలని సూచించారు. నిద్ర నుంచి మెలకువ వచ్చిన తరువాత కూడా లేచేందుకు ఇబ్బంది పడటం, ఆందోళన, చికాకును ప్రదర్శించడం, ఆలోచనలు నెమ్మదిగా సాగడం, నిదానంగా మాట్లాడటం, అతిగా ఆకలి, భ్రాంతులు కలగడం, జ్ఞాపక శక్తి మందగించడం వంటివి హైపర్ సోమ్నియా లక్షణాలని తెలిపారు. 18 నుంచి 70 ఏళ్లకు చెందిన 100 మందికి పైగా పురుషులను, మహిళలను అధ్యయనంలో భాగం చేసి వారి రక్త నమూనాలు పరీక్షించామని వివరించారు. ఈ అధ్యయనం వివరాలు 'జర్నల్ ట్రాన్స్ లేషనల్ సైక్రియాట్రి'లో ప్రచురితమయ్యాయి.