: జరిమానా కట్టాలంటూ తనయుడికి స్పష్టం చేసిన మహారాష్ట్ర మంత్రి


శివసేన నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావోతే నిజంగా ఆదర్శనీయుడే. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో తనయుడు వాదనకు దిగాడన్న విషయం తెలుసుకున్న ఆయన నిబంధనలు అందరికీ వర్తిస్తాయని తన చర్య ద్వారా చాటిచెప్పారు. జరిమానా కట్టాలంటూ తనయుడికి స్పష్టం చేశారు. వివరాల్లోకెళితే... దివాకర్ రావోతే తనయుడు ఉన్మేశ్ ను డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు నిలువరించారు. అతడిని ప్రశ్నించగా, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారితో వాదనకు దిగాడు. మరుసటి రోజు ఉదయం ఈ విషయం మంత్రి రావోతేకు తెలిసింది. వెంటనే ఆయన తన కుమారుడిని మందలించి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రూ.1000 ఫైన్ కట్టాలంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..."పోలీసులు వారి విధి వారు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తుంటారు, కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తుంటారు. నేను మంత్రినైనా గానీ, ఇలాంటి విషయాల్లో నా కుమారుడికీ మినహాయింపు ఇచ్చేదిలేదని నిరూపించాను" అని పేర్కొన్నారు. రావోతే ఇంతకుముందోసారి, హెల్మెట్ లేకుండా బైక్ పై వెళుతున్న ఓ కానిస్టేబుల్ కు జరిమానా విధించి వార్తల్లోకెక్కారు.

  • Loading...

More Telugu News