: ఎక్కడి బిల్లులు అక్కడే... నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమాప్తం!
అరుపులు, కేకలు, మాటల యుద్ధం, సస్పెన్షన్లు, ధర్నాలు, నిరసనలు, మిత్రుల మధ్యనే అభిప్రాయభేదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు... అన్ని రకాల మసాలాలతో వచ్చిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు నేటితో తెరపడనుంది. జూలై 21న సమావేశాలు ప్రారంభం కాగా, ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకుండానే ముగింపు దశకు చేరుకున్నాయి. సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాజీనామాలు చేస్తే మాత్రమే సభ సజావుగా నడిచేందుకు సహకరిస్తామని, లేకుంటే అడ్డుకుంటామని స్పష్టం చేసిన కాంగ్రెస్ తన మాట నిలుపుకుంది. లోక్ సభతో పాటు, రాజ్యసభలోనూ అసలు అర్థవంతమైన చర్చలే జరగలేదు. పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులకు మోక్షం కలగలేదు. కొత్త బిల్లులకు అవకాశమే రాలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే విలువైన సమయం వృథా అయిందని బీజేపీ ఆరోపిస్తుంటే, సభలో చర్చలు జరగకపోవడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ అంటోంది. దేశాభివృద్ధికి దోహదపడే ఎన్నో ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉండిపోగా, నాలుగేళ్ల నాడు దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ చుట్టూ నేతలు తిరుగుతూ ఉండిపోయారు. వస్తు సేవల పన్ను, బీమా సంస్కరణలు, భూసేకరణ, విదేశీ ఎఫ్ డీఐ వంటి పదుల సంఖ్యలో బిల్లులు ఈ సమావేశాల్లోనూ ఆమోదానికి నోచుకోలేకపోయాయి. ఇక ఈ బిల్లులన్నీ ఎప్పటికి ఆమోదం పొంది అమలయ్యేనో!