: చనిపోయిన పాపకు స్కూల్ ఫీజు కట్టాలన్న సిబ్బంది!
బహ్రెయిన్ లో భారతీయ దంపతులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వారి కుమార్తె జనవరిలో చనిపోతే ఆ పాపకు ట్యూషన్ ఫీజు చెల్లించాలంటూ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఎలా స్పందించాలో అర్థంకాని స్థితిలో పడిపోయారు. వివరాల్లోకెళితే... కేరళకు చెందిన జోఫీ చెరియన్, షైనీ ఫిలిప్ దంపతులు బహ్రెయిన్ లో 27 ఏళ్లుగా ఉంటున్నారు. వారి ఎనిమిదేళ్ల కుమార్తె అబియా శ్రేయా జోఫీ జనవరిలో చికెన్ పాక్స్ కారణంగా మరణించింది. కుమార్తె మరణంతో తల్లి షైనీ తీవ్ర మనోవేదనకు లోనైంది. ఇంతలోనే ఫీజు కట్టాలంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడం ఆ దంపతులకు ఆగ్రహం తెప్పించింది. ఓ తల్లి మనోభావాలను పట్టించుకోకుండా స్కూల్ సిబ్బంది ఇలా ఫోన్ చేయడం దురదృష్టకరమని జోఫీ చెరియన్ మండిపడ్డారు. పది రోజుల క్రితం తన భార్యకు ఫోన్ చేసి ఫీజు విషయం చెప్పారని, అప్పుడు తమ కుమార్తె చనిపోయిన విషయం చెప్పి ఆమె పేరు తొలగించాలని కోరామని వివరించారు. అయితే, సోమవారం మళ్లీ తనకు ఫోన్ చేసి ఫీజు విషయం అడిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం క్షమాపణ కోరింది. పాలనా పరమైన తప్పిదం చోటుచేసుకుని ఉంటుందని పాఠశాల చైర్మన్ ప్రిన్స్ నటరాజన్ పేర్కొన్నారు.