: బాధితులతో ఢిల్లీ పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?...అయితే ఇది చదవాల్సిందే!


ఢిల్లీ పోలీసులు బాధితులతో ఎలా ప్రవర్తిస్తారో వివరిస్తూ రాధికా పి.సింగ్ అనే మహిళ ఫేస్ బుక్ లో తన స్నేహితురాలికి జరిగిన విషయాన్ని వెల్లడించారు. వివాహిత అయిన సదరు మహిళ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని బరాబంఖా అనే ప్రాంతంలో పట్టపగలు నడిరోడ్డుపై నడుస్తూ ఉండగా, నిఖిల్ అనే వ్యక్తి వచ్చి ఆమెను ముద్దుపెట్టుకోబోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారని, ఆమె అసభ్యంగా దుస్తులు ధరించలేదని రాధిక తెలిపారు. ముద్దుపెట్టుకోబోతున్న ఆ దుండగుడిని నిలువరించిన ఆమె, అతనిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. దీంతో కొందరు వచ్చి అతనిని పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటన జరిగిన 40 నిమిషాల తరువాత సంఘటనా స్ధలికి చేరుకుని, నిందితుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. బాధితులను స్టేషన్ కు రమ్మని చెప్పారు. స్టేషన్ కి వెళ్లాక కన్నాట్ ప్లేస్ పీఎస్ ఎస్ హెచ్ఓకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇమ్మన్నారు. ఆమె రాసిన ఫిర్యాదును వివరాలు సరిగ్గాలేవంటూ సబ్ ఇన్ స్పెక్టర్ సంజీవ్ కుమార్ తిరస్కరించారు. దీంతో బాధితురాలు మరోసారి ఫిర్యాదు రాసింది. దానిలో అంశాలు కూడా సరిగా లేవంటూ మళ్లీ దానిని పక్కనపెట్టారు. అవమాన భారంతో దహించుకుపోతున్న స్నేహితురాలి కన్నీళ్లను చూసిన రాధిక, నిందితుడు అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించాడని, ఆ క్రమంలో ముద్దివ్వబోయాడని, ఘటన జరిగిన స్థలం, సమయం అన్నీ వివరంగా పేర్కొంటూ ఫిర్యాదు తయారు చేసి ఎస్సైకి అంజేశారు. దానిని కూడా సదరు ఎస్సై తిరస్కరించారు. దానిని తిరస్కరించడానికి ఎస్సై కారణం కూడా వివరించారు. అదేంటంటే... ముద్దివ్వబోయాడు కానీ, ముద్దివ్వలేదు కదా? అని! అంతటితో ఆగని ఎస్సై ఫిర్యాదు కూడా తీసుకోకుండా మరుసటి రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుకావాల్సి ఉంటుందని, అవసరమైతే బాధితురాలి స్నేహితులు, బంధువులను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సి ఉంటుందని భయపెట్టాడు. దీంతో బాధితురాలు మరి అతని (నిఖిల్) తరపు బంధువులను కూడా పిలుస్తారా? అని ప్రశ్నించడంతో వారు రావాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చాడు. అంతటితో ఆగని ఎస్సై బాధితురాలి ఫోన్ నెంబర్ నిందితుడి తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఎస్సై తీరు 'నిందితుడే బాధితుడు', 'బాధితులే నిందితులు' అనేలా ఉండడంతో సదరు మహిళ తీవ్ర ఆవేదన చెందింది. అప్పుడామెకు తానెంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానో అర్థమైంది. ప్రతి బాలిక తనను తాను కాపాడుకోవాల్సిన చోట ఉన్నానని ఆమె అర్థం చేసుకుంది. సంఘటన జరిగినప్పుడు కూడా తామేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ప్రవర్తించారని, అతనిని వదిలేయమని మరికొందరు సలహా ఇచ్చారని ఆమె పేర్కొంది. అనవసరంగా పోలీసులను పిలిచామని, తామే రెండు తగిలించి వదిలేసి ఉంటే బాగుండేదని రాధికా పి సింగ్ అభిప్రాయపడ్డారు. పోలీసులు నిందితుడితో ఎందుకు కుమ్మక్కయ్యారో ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె పోస్టుపై ఢిల్లీ వాసులు పోలీసులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులను తూర్పారపడుతున్నారు.

  • Loading...

More Telugu News