: ఏమీ అర్థం కావడంలేదు... సభలో టేబుల్ టెన్నిస్ చూసినట్టుంది!: టీఆర్ఎస్ ఎంపీ
పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. లలిత్ మోదీ వ్యవహారం సభ సజావుగా సాగేందుకు ప్రతిబంధకంగా మారిందని అభిప్రాయపడ్డారు. అసలు సభలో ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడంలేదని అన్నారు. సభలో జరుగుతున్న వాగ్యుద్ధాలు చూస్తుంటే టేబుల్ టెన్నిస్ ఆటను చూస్తున్నట్టుందని, అటు నుంచి అధికార పక్షం ఓ మాట అంటే, ఇటు నుంచి విపక్షం మరో మాట అంటూ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ తప్పు చేశారని తాము భావించడం లేదని జితేందర్ రెడ్డి పరోక్షంగా సర్కారుకు మద్దతు పలికారు. సుష్మాజీ అంటే తమకెంతో గౌరవం ఉందని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో తెలంగాణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆ సమస్యలను సభలో ప్రస్తావిద్దామనుకుంటే వీలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కోరారు.