: వైకాపా బంద్ 28న కాదట, 29న... ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కోరుతూ, ఈనెల 28న వైకాపా తలపెట్టిన రాష్ట్ర బంద్ ను ఒక రోజు వాయిదా వేసుకుంటున్నట్టు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. 28న శ్రావణ శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మీ వ్రతం ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మహిళలు అత్యంత పవిత్ర దినంగా భావిస్తూ, వ్రతాలు, పూజలు చేసుకునే వేళ దుకాణాలు మూతపడి, వాహనాలు తిరగకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని భావించినట్టు వివరించారు. ఢిల్లీలో వైకాపా ధర్నా చేసిన తరువాత స్పెషల్ ప్యాకేజీలంటూ తెలుగుదేశం సరికొత్త నాటకానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. ఈ ప్యాకేజీలు తెలుగుదేశం నేతలు పంచుకోవడానికే ఉపయోపడతాయని బొత్స దుయ్యబట్టారు. హోదా కోసం వైకాపా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందని అన్నారు.