: సాకర్ ఫ్యాన్స్ చేతిలో ప్రాణాలు విడిచిన జర్నలిస్టు


అజర్ బైజాన్ లో దారుణం చోటుచేసుకుంది. తమ అభిమాన సాకర్ ఆటగాడిపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓ జర్నలిస్టును సదరు ఆటగాడి ఫ్యాన్స్ చావబాదారు. దాంతో, ఈ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళితే... ఐరోపా లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో అజర్ బైజాన్ కు చెందిన గబాలా ఎఫ్ కే ఫుట్ బాల్ క్లబ్, సైప్రస్ కు చెందిన అపోలాన్ లిమాసోల్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో గబాలా స్టార్ స్ట్రయికర్ జావిద్ హుస్సేనోవ్ సైప్రస్ అభిమానుల ఎదుట టర్కీ జెండా ఊపుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. టర్కీ, సైప్రస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రమే కావడంతో, ఈ చర్య సైప్రస్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై హుస్సేనోవ్ ను ప్రశ్నించిన సైప్రస్ జర్నలిస్టుకు అవమానం ఎదురైంది. హుస్సేనోవ్ అసభ్యకర సంజ్ఞ చేశాడు. ఇది చూసిన అజర్ బైజాన్ కు చెందిన కాసిమ్ అలియేవ్ అనే పాత్రికేయుడు హుస్సేనోవ్ చర్యను తప్పుబడుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. హుస్సేనోవ్ చర్య అనైతికమని పేర్కొన్నాడు. దాంతో, ఆ సాకర్ ఆటగాడి అభిమానులు రెచ్చిపోయారు. సదరు జర్నలిస్టుపై దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన అలియేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనపై అజర్ బైజాన్ అధ్యక్షుడు విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News