: మన యుద్ధ విమానాల డీల్ కు అన్నీ సమస్యలే!
భారత వాయుసేనను బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్ తయారుచేసే 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా, అమ్మకపు నిబంధనలను ఖరారు చేసుకునే విషయంలో మాత్రం ముందడుగు పడటం లేదు. ప్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సమయంలో ఈ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది జరిగి నాలుగు నెలలైనా వాణిజ్యపరమైన చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. యూనిట్ ప్రైస్, ఎయిర్ క్రాఫ్ట్ కండిషన్ తదితర విషయాల్లో ఇరువైపుల నుంచి స్పష్టత లేదని భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, విమానాల డెలివరీ ఆలస్యం అయ్యే కొద్దీ ఇండియాకు కష్టాలు మరింతగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న యుద్ధ విమానాల్లో అత్యధికం పాత తరానికి చెందినవి కావడమే ఇందుకు కారణం. చైనా, పాకిస్థాన్ లతో పోలిస్తే, భారత విమానాల్లో అత్యాధునికత తగ్గుతోందని, ఇది దేశ రక్షణ, భద్రతలకు సంబంధించి పెను సవాళ్లను సృష్టించవచ్చని, సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని మిలటరీ అధికారులు కోరుతున్నారు.